Srinivasulu: కూటమి హామీలు బూటకపు మాటలు 1 y ago
AP : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు వైసీపీ నేత కొరుముట్లు శ్రీనివాసులు. ఇది వైసీపీ నాయకులు చెప్పడం లేదని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని అన్నారు. తాము ఎన్నో ప్రభుత్వాలు చూశామని, కానీ విధ్వంసం చేస్తూ ప్రజలను భయపెట్టే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా కొడుమూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరికాదని, ప్రజల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ అనేక మంది ప్రాణాలను కాపాడిందని, అదే విధంగా రాయలసీమలో అనేక నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తాగు, సాగు నీరందించారని చెప్పారు.
వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీలు వేరైనా జగన్ గౌరవిస్తూ ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు చేశారని అన్నారు. అధికారం ఉందని కూటమి నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన బూటకపు హామీలు, ఈవీఎంల ట్యాంపరింగ్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారని విమర్శించారు.
ఎన్నికల్లో గెలిచిన ఏ ప్రభుత్వాలు అయినా శాంతి భద్రతలపై, పర్యవేక్షణపై దృష్టి పెడతాయని, సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకొని, వ్యవస్థలను సరిదిద్దాలని చూస్తాయన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న గ్రామల దగ్గర నుంచి జిల్లాల వరకు టార్గెట్ చేసి ప్రజలను భయపెడుతూ విధ్వంసం చేస్తోందన్నారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.